: మన బంధం ప్రపంచానికి కూడా ఒక శక్తిలా తోడ్పడాలి: చైనా ప్రధానితో మోదీ
ఈ ఉదయం చైనా ప్రధాని లీ కెషాంగ్ తో భారత ప్రధాని మోదీ భేటీ అయ్యారు. అత్యున్నతమైన ఈ సమావేశంలో ఇద్దరు ప్రధానులూ పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మోడీ ప్రసంగం ఆయన మాటల్లోనే చూద్దాం. "మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే చైనా పర్యటనకు రావడం చాలా ఆనందంగా ఉంది. చైనాతో వ్యూహాత్మక భాగస్వామ్యం మాకు అత్యంత విలువైనది. చైనాకు విచ్చేసిన నాకు సాక్షాత్తు దేశాధ్యక్షుడు జిన్ పింగ్ తన సొంత పట్టణంలో ఆతిథ్యం ఇవ్వడం ఎంతో సంతోషదాయకం. మన రెండు దేశాల మధ్య నెలకొన్న బంధం... ఇరు దేశాలకే కాకుండా ప్రపంచానికి కూడా ఒక శక్తిలా తోడ్పడాలి. రెండు దేశాల మధ్య ప్రతిబంధకాలుగా ఉన్న కొన్ని సమస్యలపై స్నేహపూర్వకంగా, సావధానంగా చర్చించుకున్నాం. అంతర్జాతీయ సరిహద్దుకు సంబంధించి... రెండు దేశాలకు సమ్మతమైన, న్యాయబద్ధమైన పరిష్కారం కనుక్కునేందుకు ఇరువురూ ప్రయత్నిస్తూనే ఉండాలని నిర్ణయించాం. ఇరు దేశాల మధ్య నమ్మకం, విశ్వాసం పెంచుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. చెంగ్డు, చెన్నైలలో కాన్సులేట్ లను ఏర్పాటు చేయాలనే నిర్ణయంతో ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతమవుతాయి. ఆర్థిక సహకారానికి పెద్ద పీట వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నా పర్యటన ఇరు దేశాలకు ఎంతో లాభదాయకమైనది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ప్రధాని కెషాంగ్ తో ఇకపై కూడా కలసి పనిచేయాలని కోరుకుంటున్నాను".