: రాహుల్ యాత్ర పర్యవేక్షణలో ప్రమాదం... రోడ్డు ప్రమాదానికి గురైన ఎస్పీజీ వాహనాలు
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో చేపట్టనున్న యాత్ర నేపథ్యంలో ఆయన భద్రతను పర్యవేక్షించేందుకు వచ్చిన ఎస్పీజీ వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ పరిధిలోని జాతీయ రహదారిపై నిన్న చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఎస్పీజీ అధికారులకు చెందిన నాలుగు వాహనాలు దెబ్బతిన్నాయి. వివరాల్లోకి వెళితే... ఆదిలాబాదు జిల్లాలో చేపట్టనున్న రైతు భరోసా యాత్రకు వెళ్లనున్న రాహుల్ గాంధీ శంషాబాదు నుంచి మేడ్చల్ మీదుగా నిర్మల్ చేరుకోవాల్సి ఉంది. అయితే రాహుల్ భద్రతా విభాగం ఎస్పీజీ అధికారులు వారం రోజులుగా ఆయన ప్రయాణించే మార్గాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న మేడ్చల్ లో తనిఖీలు చేస్తున్న క్రమంలో ఎస్పీజీ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకదానితో ఒకటి ఢీకొనడంతో నాలుగు వాహనాలు దెబ్బతిన్నాయి.