: ముంబై ప్లే ఆఫ్ ఆశలు సజీవం... కోల్ కతాపై కీలక విజయం


ఐపీఎల్-8 సీజన్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు తన ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. నిన్న రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్ లో రోహిత్ శర్మ నేతృత్వంలోని ఆ జట్టు, కోల్ కతా నైట్ రైడర్స్ పై విజయం సాధించింది. టాస్ గెలిచిన కోల్ కతా ఫీల్డింగ్ ఎంచుకోగా, ముంబై ఇండియన్స్ ధాటిగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్లు లెండిల్ సిమ్మన్స్ (14), పార్థీవ్ పటేల్ (21) శుభారంభాన్నివ్వగా, రోహిత్ శర్మ (30) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత కీరన్ పొలార్డ్ (33)తో కలిసి హార్దిక్ పాండ్యా జూలు విదిల్చాడు. 31 బంతులు ఎదుర్కొన్న పాండ్యా ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 61 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత 172 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కేవలం 166 పరుగులే చేయగలిగింది. ఓపెనర్ రాబిన్ ఊతప్ప(25)తో కలిసి కెప్టెన్ గౌతం గంభీర్ (38) ఇన్నింగ్స్ ను ధాటిగానే ప్రారంభించాడు. యూసుఫ్ పఠాన్ (52)తో పాటు షకీబ్ అల్ హసన్ (23) రాణించినా కోల్ కతాకు విజయం దక్కలేదు. 20 ఓవర్లలో ఆ జట్టు కేవలం 166 పరుగులే చేసింది. దీంతో ముంబై ఐదు పరుగుల తేడాతో కోల్ కతాపై విజయం సాధించి ప్లే ఆఫ్ రేసులో నిలిచింది.

  • Loading...

More Telugu News