: కేసీఆర్ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతారు: కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు
తెలంగాణ సీఎం కేసీఆర్ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతారని శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. నిర్మల్ లో ఆయన మాట్లాడుతూ, రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నారనగానే టీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారని అన్నారు. రైతులకు భరోసా కల్పించేందుకు రాహుల్ చేస్తున్న యాత్రను చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని శ్రీధర్ బాబు చెప్పారు. రాహుల్ రైతులను సందర్శించడం ఇష్టం లేని నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని ఆయన పేర్కొన్నారు. నాందేడ్ నుంచి రాహుల్ గాంధీ నేరుగా నిర్మల్ చేరుకుంటారని ఆయన చెప్పారు. రైతులను కలిసి, వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తారని ఆయన తెలిపారు. భరోసా యాత్రలో పలు ప్రాంతాల రైతులతో ఆయన చర్చిస్తారని అన్నారు. రైతుల గురించి పట్టించుకోని ఎన్డీయే, టీఆర్ఎస్ పార్టీలకు రాహుల్ ముచ్చెమటలు పట్టిస్తున్నారని ఆయన తెలిపారు.