: భారత ప్రేక్షకుల్లో కొందరు దారుణంగా ప్రవర్తిస్తారు: ఐపీఎల్ ఛీర్ లీడర్ గాళ్ ఆవేదన
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో బంతి బౌండరీ దాటినప్పుడు, వికెట్ పడినప్పుడు ఛీర్ లీడర్స్ చేసే సందడి అంతాఇంతా కాదు. శరీరాన్ని రబ్బరులా వంచుతూ వారు చేసే డ్యాన్స్ వీక్షకులను సమ్మోహితులను చేస్తుంది. కొన్ని సార్లు వారి నాట్య భంగిమలు కుర్రకారుకు వెర్రెక్కిస్తాయి కూడా. తాజాగా, ఓ ఛీర్ లీడర్ 'రెడ్ఇట్' వెబ్ సైట్ తో తన ఐపీఎల్ అనుభవాలను పంచుకుంది. 'ఆస్క్ మీ ఎనీథింగ్' (ఏఎంఏ) ప్రాతిపదికన సాగిన ఈ ప్రోగ్రాంలో అమ్మడు పలువురు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చింది. తాను ఇంతకుముందు క్రికెట్ అభిమానిని కానని, ఐపీఎల్ తో ఒప్పందం కుదుర్చుకున్నాక ఫ్యాన్ ను అయ్యానని తెలిపింది. "నేను భారత్ లోనూ, మరో పాశ్చాత్య దేశంలోనూ ఛీర్ లీడర్ గా వ్యవహరించాను. భారత ప్రేక్షక సమూహాల్లో మగవాళ్లు చాలా అనుచితంగా ప్రవర్తిస్తారు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా పందుల్లాంటి వాళ్లు కనిపిస్తారు. వారు ఉపయోగించే భాష దారుణం. అలాంటి మాటలు మర్చిపోవడానికి ప్రయత్నిస్తా. అసలు, ఫ్యాన్స్ తో ఫొటోలకు ఓకే చెప్పకూడదని రూల్ పెట్టుకున్నా. వాళ్లలో మహిళలు ఉండనివ్వండి, పిల్లలు ఉండనివ్వండి... ఫొటోలకు మాత్రం అంగీకరించను" అని తెలిపింది. ఇక, ఛీర్ లీడర్స్ బృందంలో కొందరు భారత అమ్మాయిలు కూడా ఉంటే బాగుంటుందని అభిప్రాయపడింది.