: ప్రత్యేక రైలులో సొరంగంలోకి వెళ్లిన చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మధ్యాహ్నం వెలిగొండ పూల సుబ్బయ్య ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. అక్కడ టన్నెల్ (సొరంగం) పనులను పరిశీలించారు. అందుకోసం ఆయన ప్రత్యేక రైలెక్కారు. అధికారులు, ఇంజినీర్లతో కలిసి రైలులో సొరంగం లోపలికి వెళ్లిన చంద్రబాబు అక్కడ దాదాపు అరగంట పాటు గడిపారు. ఆయనకు టన్నెల్ పనులను ఇంజినీర్లు వివరించారు. అనంతరం, అధికారులతో సమీక్ష జరిపారు. ఇక, వెలిగొండ ప్రాజెక్టు లబ్ధిదారులైన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లా ముద్దుబిడ్డ ప్రకాశం పంతులు గురించి ప్రస్తావించారు. ఆయన తెగువకు మారుపేరు అని కీర్తించారు. ఇక, తెలుగువారి ఘనతను ప్రపంచానికి చాటిన ఏకైక వ్యక్తి నందమూరి తారకరామారావు అని స్మరించుకున్నారు. ఆయన నుంచి ఎలా పనిచేయాలో నేర్చుకున్నామని, క్రమశిక్షణ అలవర్చుకున్నామని వివరించారు. రాష్ట్రాన్ని హేతుబద్ధత లేకుండా విభజించారని, తెలుగువాళ్లకు నష్టం చేకూర్చారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. అయినాగానీ, కష్టపడి భవిష్యత్తును ఆనందమయం చేసుకుందామని పిలుపునిచ్చారు. గత పాలకులు రూ.200 పింఛనుతో నెట్టుకొచ్చారని, తాము దాన్ని రూ.1000కి పెంచామని అన్నారు. 42 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. డ్వాక్రా సంఘాలు పెట్టి, పొదుపు నేర్పింది తామేనని, దీపం పథకం ద్వారా సిలిండర్లు ఇచ్చామని వివరించారు. డ్వాక్రా మహిళలు పేదరికం నుంచి బయటపడాలనే ఇసుక రీచ్ ల బాధ్యతలు అప్పగించామని స్పష్టం చేశారు.