: యూపీలో కిడ్నాపర్ల వింత డిమాండు!


ఎవరైనా దుండగులు కిడ్నాప్ కు పాల్పడినప్పుడు భారీ మొత్తంలో నగదు డిమాండ్ చేయడం సహజం. ఎన్నో కిడ్నాప్ ఘటనలు డబ్బుతో ముడిపడినవే. అయితే, ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లాలో వీర్ పురా గరోతా గ్రామంలో ప్రదీప్ అనే ఏడేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన వ్యక్తులు విచిత్రమైన డిమాండ్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. తమకు ట్రాక్టర్ ను ఇస్తే పిల్లాడిని వదిలిపెడతామని స్పష్టం చేశారు. దీనిపై బాలుడి తల్లి సుమన్ ఝాన్సీ జిల్లా ఎస్ఎస్పీ (సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) కిరణ్ ను కలిసి తన కుమారుడి కిడ్నాప్ వ్యవహారం వివరించింది. మే 6న ఇంటి ముందు ఆడుకుంటున్న అబ్బాయిని మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని తెలిపింది. అనంతరం, కిడ్నాపర్లు ఫోన్ చేసి ట్రాక్టర్ కావాలన్నారని, లేకుంటే తన కుమారుడిని చంపేస్తామని హెచ్చరించారని చెప్పింది. అటు, ఇద్దరు గ్రామస్థులు కూడా కిడ్నాపర్లకు ట్రాక్టర్ ఇస్తే పిల్లాడిని వదిలిపెడతారని నమ్మకంగా చెప్పారని సుమన్ వివరించింది. ఈ కిడ్నాప్ ఉదంతంలో తమ బంధువు హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నట్టు కూడా పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News