: 150 కోట్ల తన వాటాను ఉద్యోగులకు అప్పనంగా ఇచ్చేశాడు!
డబ్బెవరికి చేదు, అంటే 'నాకు మాత్రం చేదే' అంటున్నాడు 'హౌసింగ్ డాట్ కామ్' సీఈవో రాహుల్ యాదవ్. తన 150 కోట్ల రూపాయల విలువైన వాటాను ఆ కంపెనీ ఉద్యోగులకు అప్పనంగా ధారాదత్తం చేశాడు. కంపెనీ సీఈవోగా సహోద్యోగులపై విమర్శలు చేస్తూ రాజీనామా చేసిన ఆయన, సాయంత్రానికల్లా దానిని ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఇది జరిగి వారం రోజులు కాకుండానే వ్యాపార వర్గాలు ఆశ్చర్యపోయే నిర్ణయం తీసుకున్నాడు. హౌసింగ్ డాట్ కామ్ లో రాహుల్ యాదవ్ వాటా విలువ 150 నుంచి 200 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఈ మొత్తాన్ని ఆయన ఆ సంస్థలో పని చేస్తున్న 2,251 మంది ఉద్యోగులకు ఇచ్చేశారని సంస్థ తెలిపింది. ఈ వాటా విలువ ఆ సంస్థలో ఉద్యోగుల ఏడాది వేతనానికి సమానమని హౌసింగ్ డాట్ కామ్ వెల్లడించింది. దీని గురించి రాహుల్ యాదవ్ మాట్లాడుతూ, ఇంకా తన వయసు 26 సంవత్సరాలేనని, డబ్బు గురించి ఇప్పుడే సీరియస్ గా ఆలోచించడం తొందరపాటు అవుతుందని, అందుకే తన వాటాను ఉద్యోగులకు ఇచ్చేశానని అన్నాడు.