: నా కొడుకును కాపాడండి... కేంద్రానికి దేవేందర్ గౌడ్ వేడుకోలు

టీడీపీ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్రానికి హోం శాఖ మంత్రిగా పనిచేసేిన తూళ్ల దేవేందర్ గౌడ్ నిన్న ఉన్నపళంగా ఢిల్లీలో వాలిపోయారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తో పాటు పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుతోనూ భేటీ అయ్యారు. నేపాల్ లో చిక్కుకుపోయిన తన కుమారుడు వీరేందర్ గౌడ్ ను సురక్షితంగా తీసుకురావాలని ఆయన కేంద్ర మంత్రులను కోరారు. భూకంపం ధాటికి విలవిల్లాడిన నేపాల్ ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు నేపాల్ వెళ్లిన వీరేందర్ గౌడ్ మంగళవారం చోటుచేసుకున్న భూకంపంతో ప్రమాదంలో పడ్డారు. విరిగిపడ్డ కొండచరియల నుంచి జాగ్రత్తగానే తప్పించుకున్నారు. అయితే అక్కడి నుంచి ఎలా బయటపడాలో అతడికి తెలియడం లేదట. దీంతో రంగంలోకి దిగిన దేవేందర్ గౌడ్, తన కుమారుడితో పాటు వెళ్లిన 16 మందితో కూడిన బృందాన్ని సురక్షితంగా తీసుకురావాలని ఆయన కేంద్ర మంత్రులకు విన్నవించారు.