: కేసీఆర్ సహకారంతోనే గెలిచాం!: ‘మా’ కార్యవర్గ సభ్యుడు కాదంబరి సంచలన ప్రకటన
రాజకీయ ప్రత్యక్ష ఎన్నికలను తలపించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడినా, ఆ వేడి మాత్రం ఇంకా తగ్గలేదు. ఎందుకంటే, రోజుకో కొత్త తరహా ప్రకటన ఈ ఎన్నికలపై వెలువడుతోంది. ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన నటుడు రాజేంద్రప్రసాద్ పలు సందర్భాల్లో ఆసక్తికర ప్రకటనలు చేయగా, ఆయనకు వెన్నంటి నిలవడంతో పాటు ‘మా’ కార్యవర్గంలో సభ్యుడిగా ఎన్నికైన కాదంబరి కిరణ్ నిన్న ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఆ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సహకారంతోనే తమ ప్యానెల్ ఎన్నికల్లో విజయం సాధించిందని ఆయన చెప్పుకొచ్చారు. పసికూనలమైన తాము, సింహాల్లాంటి వారితో తలపడి విజయం సాధించామని పేర్కొన్నారు. ఈ విజయం కేసీఆర్ సహకారంతోనే సాధ్యమైందని ఆయన ప్రకటించారు. రాష్ట్ర విభజన తర్వాత ఎవరు ఏ రాష్ట్రానికి చెందుతారో తేలిపోయిందన్న ఆయన, సినీ జనాలు మాత్రం ఏ ప్రాంతానికి చెందినవారో తేలలేదని వ్యాఖ్యానించారు.