: చివరలో సత్తా చాటిన పంజాబ్... లక్ష్యఛేదనలో చతికిలబడ్డ బెంగళూరు!

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కు ప్లే ఆఫ్ అవకాశాలు ఎప్పుడో అడుగంటాయి. అయితే నాణ్యమైన క్రికెట్ కు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన ఆ జట్టు చివరలో సత్తా చాటుతోంది. నిన్న రాత్రి సొంత మైదానం మొహాలీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో పటిష్ఠమైన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టును చిత్తు చేసి తన సత్తాను నిరూపించుకుంది. వర్షం అడ్డంకి కారణంగా పది ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో అటు బ్యాటింగ్ లోనే కాక, ఇటు బౌలింగ్ లోనూ తనదైన శైలిలో రాణించిన పంజాబ్ విజయం సాధించింది. టాస్ గెలిచిన బెంగళూరు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుని పంజాబ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. నిర్ణీత 10 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయిన పంజాబ్ 106 పరుగులు చేసింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (31)తో పాటు ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (20) రాణించడంతో పది ఓవర్లలోనే పంజాబ్ సెంచరీని అధిగమించింది. ఆ తర్వాత 107 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 8.4 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి కేవలం 84 పరుగులే చేసింది. దీంతో పంజాబ్ చేతిలో చిత్తుగా ఓడింది. ఓపెనర్లు క్రిస్ గేల్ (17), విరాట్ కోహ్లీ (19) రాణించినా మిగిలిన బ్యాట్స్ మెన్ చేతులెత్తేయడంతో బెంగళూరుకు పరాభవం తప్పలేదు.