: సచిన్ తనయుడికి కిటుకులు చెప్పిన పాక్ లెజెండ్


పాకిస్థాన్ పేస్ దిగ్గజం వసీం అక్రమ్ ఎందరికో మార్గదర్శనం చేశాడు. కెరీర్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్న బౌలర్లను తన సలహాలతో మళ్లీ ట్రాక్ లో నిలబెట్టాడు. ఒక్క పాక్ బౌలర్లే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జట్లలో అక్రమ్ శిష్యులున్నారంటే అతిశయోక్తి కాదు. తాజాగా, అక్రమ్ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ కు కూడా బౌలింగ్ లో కిటుకులు బోధించాడు. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు బౌలింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్న ఈ పాకిస్థానీ ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ కోసం ముంబయి విచ్చేశాడు. నెట్ ప్రాక్టీసు కోసం సచిన్ తనయుడు అర్జున్ కూడా వాంఖెడే మైదానానికి వచ్చాడు. తండ్రి సచిన్ ముంబయి మెంటార్ కావడంతో అతడితో పాటు నెట్స్ వద్దకు వచ్చాడు. నైట్ రైడర్స్ బౌలర్ల ప్రాక్టీసును పర్యవేక్షిస్తూ అక్కడే ఉన్న అక్రమ్ యువ అర్జున్ తో చాలాసేపు ముచ్చటించాడు. ఈ సందర్భంగా ప్రభావవంతంగా ఎలా బంతులు విసరాలో వివరించాడు. ఫిట్ నెస్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని కూడా సలహా ఇచ్చాడు. అనంతరం అక్రమ్ మీడియాతో మాట్లాడుతూ... "గత వేసవిలో అర్జున్ ను ఇంగ్లాండ్ లో కలిశాను. అక్కడ అతడో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడాడు. మ్యాచ్ లో అర్జున్ బౌలింగ్ చేస్తుండగా, నేను మిడాన్ లో ఉన్నాను. బ్రియాన్ లారాను దాదాపు అవుట్ చేశాడనే అనుకున్నా. అంతబాగా బౌలింగ్ చేశాడు. అర్జున్ కూడా లెఫ్టార్మ్ మీడియం పేసర్ కావడంతో, యాక్షన్ గురించి, స్వింగ్ గురించి మాట్లాడాను. ఫిట్ నెస్ చాలా కీలకమని కూడా చెప్పాను. అతనెంతో ఆసక్తి ప్రదర్శించాడు. అదెంతో ముఖ్యం" అని తెలిపాడు.

  • Loading...

More Telugu News