: నేను తప్పు చేశాను...నా కుటుంబం నన్ను వదిలేసింది: నీతూ అగర్వాల్
కీటకానికి కూడా హాని తలపెట్టని తనను చంపాలని చూస్తున్నారని సినీ నటి నీతూ అగర్వాల్ తెలిపింది. హైదరాబాదులో ఓ టీవీ ఛానెల్ తో ఆమె మాట్లాడుతూ, తల్లిదండ్రులను వద్దనుకుని తప్పు చేశానని చెప్పింది. మస్తాన్ వలీని నమ్మి తల్లిదండ్రులను వదులుకుని మోసపోయానని రోదించింది. ప్రేమపేరుతో పెళ్లి చేసుకుని మస్తాన్ వలీ తనను వంచించాడని నీతూ అగర్వాల్ తెలిపింది. అనుక్షణం ప్రాణభయంతో కాలం వెళ్లదీస్తున్నానని ఆమె పేర్కొంది. నమ్మి పెళ్లి చేసుకుంటే నరకం చూపించాడని ఆమె వాపోయింది. శారీరకంగా హింసించినా తానేనాడూ బాధపడలేదని, జైలు గోడలు రుచి చూడడం తట్టుకోలేకపోతున్నానని నీతూ అగర్వాల్ చెప్పింది. ఇంట్లోంచి అడుగు బయటకు పెడితే మస్తాన్ వలీ అనుమానంతో అడిగేవాడని, నిర్బంధంలో ఉంచాడని, గతంలో అతనికి జరిగిన రెండు వివాహాలను దాచిపెట్టి, తనను మభ్యపెట్టాడని నీతూ అగర్వాల్ తెలిపింది. తన కుటుంబాన్ని వదిలేయడం వల్లే, వాళ్లు తన గురించి పట్టించుకోవడం మానేశారని, తన తండ్రికి పట్టుదల ఎక్కువని, ఆయన తనను వదిలేశారని నీతూ పేర్కొంది.