: తమకంటూ ఓ దేశం ఉందని చెప్పుకోలేని నిర్భాగ్యులు వీళ్లు!
మయన్మార్ లో మైనారిటీ ప్రజలను రోహింగ్యా ప్రజలంటారు. వారంతా ముస్లింలే. ఇప్పుడు వారెంతటి దుస్థితిలో చిక్కకున్నారో తెలిస్తే హృదయం ద్రవించక మానదు. భారత్ కు పొరుగునే ఉన్న మయన్మార్ లో బౌద్ధమతస్తులు మెజారిటీ వర్గంగా ఉన్నారు. దీంతో, రోహింగ్యా ప్రజలు ఏదీ డిమాండ్ చేయలేని పరిస్థితి. పాలకుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. కఠిన ఆంక్షలు, కనీస సౌకర్యాల లేమి, దుర్భర దారిద్ర్యం... వీరిని ఇప్పుడు దేశం వదిలిపెట్టి వెళ్లిపోయేలా పురికొల్పుతున్నాయి. వీరిపై జరిగే దాడులను ప్రభుత్వం పట్టించుకోదు. దీంతో, ప్రాణాలు దక్కితే చాలనుకుని రోహింగ్యా ప్రజలు చిన్న చిన్న పడవల్లో మలేషియా, ఇండోనేషియా దేశాలకు పయనమయ్యారు. కొన్నేళ్ల క్రితం రోహింగ్యా ప్రజలను తమ భూభాగంపైకి అనుమతించిన ఈ ముస్లిం ప్రాబల్య దేశాలు, ఇప్పుడు ఒత్తిళ్లకు తలొగ్గి, వారి ప్రవేశానికి అంగీకరించడంలేదు. వీరి రాకతో సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని పలు సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి కూడా. దీంతో, స్వదేశం వీడి వచ్చిన ఈ నిర్భాగ్యులు పడవల్లోనే సముద్రంలో కాలం గడుపుతున్నారు. తమను భూభాగంపైకి అనుమతించడంటూ మలేషియా, ఇండోనేషియా పాలకులను వేడుకుంటున్నారు. తమకంటూ ఓ దేశం ఉందని చెప్పుకోలేని ఈ అభాగ్యులు పడవల్లో పడుతున్న అగచాట్లు దారుణం అని మానవ హక్కుల సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. మరి, వీరి గోడును ఆయా దేశాల పాలకులు విని, ఆశ్రయం కల్పిస్తారో? లేదో? కాలమే చెప్పాలి!