: కేపీ వస్తుండడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న సన్ రైజర్స్
వరుస విజయాలతో ఊపుమీదున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు స్టార్ బ్యాట్స్ మన్ కెవిన్ పీటర్సన్ జట్టుతో కలవనుండడంపై సంతోషం వ్యక్తం చేస్తోంది. శుక్రవారం జట్టులో చేరతాడని, ఆదివారం ముంబయి జట్టుతో జరిగే మ్యాచ్ లో ఆడతాడని సన్ రైజర్స్ మేనేజ్ మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. కేపీ చేరిక జట్టును మరింత బలోపేతం చేస్తుందని, టాపార్డర్ పటిష్టమవుతుందని పేర్కొంది. కాగా, ఐపీఎల్-8 వేలంలో సన్ రైజర్స్ యాజమాన్యం పీటర్సన్ ను దక్కించుకున్నా, అతడు జాతీయ జట్టులో చోటు కోసం కౌంటీల్లో ఆడేందుకు అనుమతి తీసుకుని ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు. అయితే, ఇంగ్లాండ్ క్రికెట్ డైరక్టర్ గా మాజీ ఆటగాడు ఆండ్రూ స్ట్రాస్ రావడంతో కేపీకి చుక్కెదురైంది. తామిద్దరికీ పొసగదని, అందుకే కేపీని ఇంగ్లాండ్ జట్టుకు ఎంపిక చేయలేమని స్ట్రాస్ స్పష్టం చేశాడు. అప్పటికే ఓ ట్రిపుల్ సెంచరీ నమోదు చేసి ఫామ్ నిరూపించుకున్న కేపీ ఈ పరిణామంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఇక, అక్కడే ఉంటే లాభం లేదనుకుని, ఐపీఎల్ లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. కేపీ జట్టుతో కలవనుండడంపై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు హెడ్ కోచ్ టామ్ మూడీ స్పందించారు. ఇదో మంచి వార్త అని, జట్టులో ఓ వరల్డ్ క్లాస్ బ్యాట్స్ మన్ చేరుతున్నాడని హర్షం వ్యక్తం చేశారు. అతడిని జట్టులోకి స్వాగతించేందుకు ఎదురుచూస్తున్నామని తెలిపారు.