: తెలంగాణ ధనిక రాష్ట్రం కనుక...44 శాతం ఫిట్ మెంట్ ఇస్తున్నాం: కేసీఆర్
తెలంగాణ ధనిక రాష్ట్రం కనుక ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని నిర్ణయించామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఆర్టీసీకి ఫిట్ మెంట్ ఇవ్వడం కారణంగా 826 కోట్ల రూపాయల నష్టభారం పడుతుందని చెప్పారు. ప్రస్తుతం టీఎస్ ఆర్టీసీ 400 కోట్ల రూపాయల నష్టాల్లో ఉందని ఆయన వెల్లడించారు. ప్రపంచంలోని పెద్ద నగరాలైన న్యూయార్క్, లాస్ ఎంజిలెస్ లాంటి చోట్ల అర్బన్ ట్రాన్స్ పోర్టేషన్ లాభాల్లో లేదని, హైదరాబాదులో కూడా లాభాల్లో లేదని అన్నారు. అందుకే ఆయా పట్టణాల్లో ట్రాన్స్ పోర్టేషన్ భారం మేయర్ పై వేశారని ఆయన తెలిపారు. తెలంగాణలో కూడా అదే పధ్ధతి అనుసరిస్తామని కేసీఆర్ ప్రకటించారు. జీహెచ్ఎంసీ అయితే ట్యాక్సుల సర్దుబాట్లు చేసుకుని ఆర్టీసీని లాభాల్లో నడుపుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. తాము అధికారం చేపట్టేనాటికి ఆర్టీసీని కాంగ్రెస్ ప్రభుత్వం పెంటకుప్పలా తయారు చేసి ఇచ్చిందని, ఇప్పుడేమో ఆర్టీసీ కార్మికుల సమ్మె వెనుక కేసీఆర్, హరీష్ ఉన్నారని పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తారని ఆయన విమర్శించారు. తెలంగాణలో ఆర్టీసీ సామాన్యుడికి అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పారు. ఆర్టీసీ లాభాల్లో నడిస్తే ప్రయాణికుల టికెట్ల ధరలు తగ్గుతాయని ఆయన చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి రోజూ 93 లక్షల మంది ప్రయాణికులను ఆర్టీసీ మోస్తోందని ఆయన వివరించారు. ఆర్టీసీ కార్మికుల జీతాలు తక్కువగా ఉన్నాయని తక్షణం జీతాలు పెంచాల్సిన అవసరం వుందని అన్నారు. ఇకపై ప్రతి ఏడాది ఆర్టీసీకి ప్రత్యేక బడ్జెట్ పెడతామని ఆయన తెలిపారు. అలాగే మున్సిపల్ యాక్ట్ సవరించి, అర్బన్ ఆర్టీసీని మున్సిపాలిటీల పరిధిలోకి తెస్తామని ఆయన వెల్లడించారు. అందులో భాగంగా, జీహెచ్ఎంసీ 200 కోట్ల రూపాయల ఆర్టీసీ నష్టాన్ని భరించాలని ఆయన సూచించారు. ఆర్టీసీ కార్మికులు బిజీ రూట్లు గుర్తించి, ఎక్కువ బస్సులు నడపడం ద్వారా డబ్బులు రాబట్టాలని ఆయన హితవు పలికారు. అలాగే గతంలో ఉన్న అప్పులు చెల్లిస్తే వడ్డీలు మిగులుతాయని, దానిపై దృష్టి పెట్టామని ఆయన చెప్పారు. తక్షణం ఆర్టీసీ కార్మికుల ఫిట్ మెంట్ 44 శాతం పెంచుతున్నామని ఆయన తెలిపారు. ఆర్టీసీ పాత బకాయిల్లో 50 శాతం బాండ్స్ రూపంలో తీరుస్తామని ఆయన చెప్పారు. మిగిలిన 50 శాతం బకాయిలను పండగ సీజన్లు అయిన వచ్చే దసరా, ఉగాది, ఆ తరువాత వచ్చే దసరాకు మూడు దఫాలుగా కార్మికులకు చెల్లిస్తామని కేసీఆర్ చెప్పారు. సమ్మె కాలంలో కార్మికులపై పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అలాగే సమ్మె కాలంలో ఇప్పటి వరకు విధించిన సస్పెన్షన్లు ఎత్తేస్తామని ఆయన వెల్లడించారు. ఆర్టీసీలో కాంట్రాక్టు కార్మికులుగా పని చేస్తున్నవారి సర్వీసులను రెగ్యులరైజ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. వారికి జూన్ నుంచి జీతాలు వర్తిస్తాయని ఆయన తెలిపారు.