: విద్యార్థులను మోసం చేసి తప్పుదోవపట్టించిన ఐఐపీఎం వ్యవస్థాపకుడు అరిందమ్... ఎఫ్ఐఆర్ నమోదు
ఇండియాలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్ మెంట్ (ఐఐపీఎం) వ్యవస్థాపకుడు అరిందన్ చౌధురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆయన తన వర్శిటీ విద్యార్థులను తప్పుదారి పట్టించారని, మోసం చేశారని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో ఐపీసీ సెక్షన్ 420 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఐఐపీఎం అందించే వివిధ కోర్సులకు ఎటువంటి గుర్తింపూ లేకపోయినా, ఆయన విషయాన్ని దాచి విద్యార్థులను మోసం చేశాడని వివరించారు. అరిందమ్ తో పాటు ఆయన తండ్రి, ఐఐపీఎం డైరెక్టర్ మలయేంద్ర కిషోర్ పైనా కేసు పెట్టినట్టు వివరించారు. కాగా, ఈ విషయమై ఐఐపీఎం స్పందిస్తూ, తమ సంస్థ విద్యార్థులను మోసం చెయ్యలేదని పేర్కొంది. యూజీసీలో నెలకొన్న అవినీతిపై విమర్శలు చేసినందునే తమపై కక్ష కట్టారని అరిందమ్ ఆరోపించారు. మేము డిగ్రీలను ఇస్తామని ఎన్నడూ చెప్పలేదని, తమకు పలానా సంస్థ నుంచి గుర్తింపు ఉన్నట్టు చెప్పి విద్యార్థులను మోసం చెయ్యలేదని ఆయన తెలిపారు. భారత చట్టాలకు కట్టుబడిన వ్యక్తులుగా విచారణకు సహకరిస్తామని పేర్కొన్నారు.