: టాయిలెట్ కట్టించలేదని నాలుగేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికిన మహిళ
పెళ్లయి నాలుగేళ్లయినా, కనీసం ఒక మరుగుదొడ్డి కట్టించలేకపోయిన మొగుడు తనకు అక్కర్లేదంటూ బీహార్ వైశాలీ జిల్లాలో ఒక మహిళ విడాకులు తీసుకుని తమ వైవాహిక బంధానికి ముగింపు పలికింది. సునీతా దేవి (21)కి 2011లో పహరాన్ పూర్ కు చెందిన కూరగాయల వ్యాపారి ధీరజ్ చౌధరితో వివాహం జరిగింది. ఓ రెండు గదుల చిన్న ఇంట్లో ధీరజ్ తల్లిదండ్రులతో కలిసి వారు నివసిస్తున్నారు. ఈ ఇంటికి టాయిలెట్ లేదు. పెళ్లయిన మరుసటి రోజు నుంచి సునీతా దేవి అడుగుతూనే ఉన్నప్పటికీ, దీరజ్ మాత్రం ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చాడు. "నేను ఎన్నోసార్లు అడుగుతూ వచ్చాడు. బహిర్భూమికి వెళ్లినప్పుడు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాను. విడాకులు తప్ప నాకు మరో మార్గం కనిపించలేదు" అని ప్రస్తుతం తల్లిదండ్రుల చెంతకు చేరిన సునీత చెబుతోంది. "అవును. మా జంట విడిపోవడానికి ఒక కారణం మరుగుదొడ్డి లేకపోవడం. ఇటీవల మా నాన్న కూడా చనిపోయాడు. ఇంట్లో సంపాదించేది నేనొక్కడినే. టాయిలెట్ కట్టించేందుకు నా దగ్గర డబ్బులేదు" అని సునీత భర్త వాపోయాడు. కాగా, అధికారిక గణాంకాల ప్రకారం జార్ఖండ్ లో 92 శాతం గ్రామీణ గృహాల్లో, బీహార్ లో 82 శాతం, యూపీలో 78 శాతం, ఒడిశా, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 85 శాతానికి పైగా ఇండ్లలో మరుగుదొడ్లు లేవు.