: వారంలో సీఎం పగ్గాలు అందుకోనున్న పురచ్చితలైవి
'పురచ్చితలైవి' జయలలిత మళ్లీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు రంగం సిద్ధమవుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు ఆమెను నిర్దోషిగా పేర్కొనడంతో తమిళనాడులో ఏఐఏడీఎంకే వర్గాల్లో హర్షం వెల్లివిరుస్తోంది. 'అమ్మ'ను మళ్లీ సీఎంగా చూడాలని వారు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో, వారం రోజుల్లో జయలలిత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. జయ మే 20కి ముందే ప్రమాణస్వీకారం చేయవచ్చని, అయితే, కచ్చితమైన తేదీని చెప్పలేమని సదరు వర్గాలు పేర్కొంటున్నాయి. అంతకుముందు, కర్ణాటకలోని ప్రత్యేక కోర్టు ఆమెకు ఈ కేసులో శిక్ష ఖరారు చేయగా, బెయిల్ పై బయటికి వచ్చారు. కానీ, అనర్హత కారణంగా సీఎం పదవిని వదులుకున్నారు. దాంతో, ఆమెకు నమ్మినబంటు పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా బాధ్యతలు అందుకున్నారు. ఆయన సీఎం అయినాగానీ, 'అమ్మ' ఫొటోను పక్కనబెట్టుకుని పాలన సాగించడం విశేషం.