: రాహుల్ ను 'ఎం.ఐ.ఏ' అని తేల్చేసిన స్మృతి
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రాహుల్ ను 'ఎం.ఐ.ఏ' అని ప్రకటించారు. ఎం.ఐ.ఏ అంటే... 'మిస్సింగ్ ఇన్ యాక్షన్' అని భాష్యం చెప్పారు. స్మృతి నేడు రాహుల్ నియోజకవర్గం అమేథీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అమేథీ ఎంపీ (రాహుల్ గాంధీ) ఆచూకీ లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి సెలవుపై వెళ్లిపోయారని విమర్శించారు. రాహుల్ పర్యటనకు ఆరు రోజుల ముందే అమేథీ పర్యటనకు రావడం వ్యూహాత్మకమా? అన్న ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ, రాహుల్ గాంధీ పర్యటన సమయాన్నే అనుమానించాలని, తన పర్యటన సమయాన్ని కాదని అన్నారు. "ఆయన వస్తున్నారంటే సంతోషమే. ఇలాగైనా ఆయన నా అడుగు జాడల్లో నడుస్తున్నారు. అమేథీ ప్రజలు ఆయనను చూడబోతున్నారు" అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ కార్యాలయం రెండ్రోజుల అమేథీ పర్యటన షెడ్యూల్ ను హడావుడిగా ప్రకటించింది. ఈ నెల 18న రాహుల్ అమేథీ వస్తాడని పేర్కొంది. అయితే, ఈ ప్రకటన తాను అమేథీ వెళతానని ప్రకటించిన అనంతరమే వెలువడిందని, ఎవరు ఎవరిని కాపీ కొడుతున్నట్టు? అని స్మృతి ప్రశ్నించారు.