: బీజేపీతో అన్నా డీఎంకే దోస్తీ?... జయకు మోదీ గ్రీటింగ్స్ తో ఊహాగానాలు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో నిర్దోషిగా బయటపడడంతో కొత్త రాజకీయ సమీకరణాలపై ఊహాగానాలు మొదలయ్యాయి. రూ.66 కోట్ల మేర అక్రమాస్తుల కేసులో ఆమెను దోషిగా తేల్చి నాలుగేళ్ల జైలు, రూ.100 కోట్ల మేర జరిమానా విధిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును నిన్న కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. తీర్పు వెలువడిన మరుక్షణమే జయలలితకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేకంగా మెసేజ్ పంపారు. ట్విట్టర్ వేదికగా మోదీ పలువురికి గ్రీటింగ్స్ చెబుతున్న విషయం కొత్తదేమీ కాకున్నా, జయలలితకు ఆయన పంపిన సందేశం ఆసక్తికర చర్చకు తెరలేపింది. దీనిపై అటు తమిళనాడులోనే కాక, ఇటు ఢిల్లీ రాజకీయవర్గాల్లోనూ పెద్ద చర్చే నడుస్తోంది. బీజేపీతో జయలలిత దోస్తీ కట్టడం ఖాయమేనన్న వాదనకు మోదీ ట్వీట్స్ మరింత బలం చేకూర్చాయని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.