: ఎస్మా తమకు వర్తించదని హైకోర్టులో వాదించిన తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మరోమారు ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణకు రెండు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏ నిబంధన కింద సమ్మె చేస్తున్నారన్న హైకోర్టు ప్రశ్నకు కార్మిక సంఘాలు కూడా దీటుగానే సమాధానం చెప్పాయి. పరిశ్రమల చట్టం పరిధికి లోబడి ముందుగా యాజమాన్యానికి నోటీసు ఇచ్చిన తర్వాతే సమ్మె చేస్తున్నామని చెప్పారు. ఏది ఏమైనా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న సమ్మె చట్ట విరుద్ధమేనని హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీ కార్మికులు కూడా ప్రభుత్వ ఉద్యోగులేనన్న హైకోర్టు, తక్షణమే సమ్మె విరమించాలని సూచించింది. సమ్మె విరమించని పక్షంలో ఎస్మా ప్రయోగించాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీంతో తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు తమకు ఎస్మా వర్తించదని తేల్చిచెప్పాయి. నిబంధనలకు లోబడి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న తమపై ఎస్మా ప్రయోగం చెల్లదని కూడా కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి.