: కోదండరాం గారూ...గోడమీద పిల్లిలా ఉండొద్దు: ముఖం మీదే చెప్పేసిన సీనియర్ జర్నలిస్ట్ పాశం!
తెలంగాణ ఉద్యమంలో రాజకీయ జేఏసీ చైర్మన్ గా ప్రొఫెసర్ కోదండరాందే కీలక భూమిక. విద్యార్థులను, ఉద్యోగులను ఒక్కతాటిపైకి తేవడంలో ఆయన కృతకృత్యులయ్యారు. ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసిపడేలా చేశారు. తీరా తెలంగాణ వచ్చేసింది. కోదండరాం ఉద్యోగంలో చేరిపోయారు. అడపాదడపా మీటింగ్ లకు హాజరవుతున్న ఆయన కేసీఆర్ సర్కారు నిర్ణయాలపై తనదైన రీతిలో నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు. అయితే నిన్న హైదరాబాదులో జరిగిన తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ సదస్సుకు హాజరైన కోదండరాంకు షాక్ తగిలింది. సీఎం కేసీఆర్ నిర్ణయాలతో విభేదిస్తున్నవారంతా ఒక్కతాటిపైకి వస్తున్నారు. ఈ క్రమంలో సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, కోదండరాంకు ఝలకిచ్చారు. కోదండరాం గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన యాదగిరి, తమలాగా ఆటో ఇటో ఉండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో వేదిక మీదే ఉన్న కోదండరాం ఎలా స్పందించాలో కూడా అర్ధం కాక సతమతమయ్యారట.