: చంద్రబాబును బంగాళాఖాతంలో పడేసేవరకు పోరాటం ఆపను: జగన్
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైసీపీ అధ్యక్షుడు జగన్ విరుచుకుపడ్డారు. అబద్ధాలతో కాలం గడుపుతున్న చంద్రబాబును బంగాళాఖాతంలో పడేసేవరకు పోరాటం ఆపబోనని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావన్నారు. పోలీసులను ఉపయోగించుకుని చంద్రబాబు వైసీపీ నేతలను హత్య చేస్తున్నాడని ఆరోపించారు. ఇక, చంద్రబాబు సర్కారు విధానాల కారణంగా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని విమర్శించారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 86 మంది రైతులు బలవన్మరణం చెందారని వివరించారు. చంద్రబాబు రైతుల ఆత్మహత్యలను కూడా అవహేళన చేస్తున్నాడని మండిపడ్డారు. గుంటూరులో జూన్ 5, 6 తేదీల్లో నిరాహారదీక్ష చేస్తున్నానని, చంద్రబాబు మోసాన్ని దేశానికి అర్థమయ్యేట్టు చేస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఒకమాట, తర్వాత మరోమాట చెబుతున్నారని దుయ్యబట్టారు.