: షాపింగ్ మాల్లో అడవి పంది హల్ చల్
అడవి పందులు ఎంతటి ప్రమాదకరమైన జంతువులో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. మనుషులపై తీవ్రస్థాయిలో దాడి చేస్తాయి. వాటి దాడిలో కొన్నిసార్లు వ్యక్తులు ప్రాణాలు కోల్పోతారు. సాధారణంగా, ఇవి పంట చేల పరిసరాల్లో సంచరిస్తుంటాయి. అలాంటి అడవి పంది హాంకాంగ్ లోని ఓ షాపింగ్ మాల్లో దూరి కలకలం రేపింది. పారడైజ్ మాల్ లో ప్రవేశించిన ఈ వరాహం అక్కడి హడావుడి చూసి తత్తరపాటుకు గురైంది. కాసేపు ట్రయల్ రూంలో, కాసేపు షోకేస్ లో... ఇలా మాల్ అంతా స్వైర విహారం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు దాన్ని పట్టుకునేందుకు నానా తిప్పలు పడ్డారు. నాలుగు గంటల పాటు అందరినీ హడలెత్తించిన ఆ అడవి పంది ఎట్టకేలకు పట్టుబడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం, దాన్ని ఓ యానిమల్ మేనేజ్ మెంట్ కేంద్రానికి తరలించారు. అన్నట్టు... హాంకాంగ్ లో అడవి పందులు ఎక్కువట.