: ఐపీఎల్ పై పాకిస్థాన్ లో జోరుగా బెట్టింగులు
భారత్ లో ఐపీఎల్ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. కొన్ని మ్యాచ్ లు పసందైన క్రికెట్ మజాను అందిస్తున్నాయి. భారత్ లో పరిస్థితి ఇలా ఉంటే, పొరుగుదేశం పాకిస్థాన్ లో ఐపీఎల్ మ్యాచ్ లపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. లాహోర్ కేంద్రంగా బెట్టింగ్ జరుగుతోందని తెలుస్తోంది. తాజాగా, లాహోర్ లో బెట్టింగులకు పాల్పడుతున్న ఆరుగురిని అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో ఓ ఇంటిపై దాడి చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సెల్ ఫోన్లు, ఓ ల్యాప్ టాప్, నగదు, కస్టమర్ల వివరాలతో కూడిన రిజిస్టర్లు స్వాధీనం చేసుకున్నారు. పాక్ లోని మిగతా నగరాల్లోనూ బుకీల కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పోలీసులు భావిస్తున్నారు.