: భారత్-పాక్ క్రికెట్ సిరీస్ పై రాజకీయ నీడలు... మండిపడుతున్న బీజేపీ ఎంపీ
భారత్-పాకిస్థాన్ క్రికెట్ సిరీస్ ఈ డిసెంబర్ లో ఉండొచ్చంటూ ఇరు దేశాల క్రికెట్ బోర్డులు పేర్కొంటుండగా... బీజేపీ ఎంపీ ఆర్కే సింగ్ మాత్రం మండిపడుతున్నారు. లోక్ సభ జీరో అవర్ లో ఆయన మాట్లాడుతూ... పాక్ తో క్రికెట్ సిరీస్ ను తాను గట్టిగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. 26/11 ముంబయి దాడులు, మాస్టర్ మైండ్ జకీయుర్ రెహ్మాన్ లఖ్వీ విడుదల అంశాలను గుర్తు చేస్తూ... టెర్రరిస్టులకు ఆశ్రయమిస్తున్న దేశంతో, మనపై దాడులకు పాల్పడ్డ దేశంతో క్రికెట్ ఆడడంలో ఔచిత్యం ఏమిటో తనకు అర్థం కావడంలేదన్నారు. "కేంద్ర హోం మంత్రి చెప్పినట్టుగా, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లో ఉన్నాడు. ప్రతి రోజూ నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదులను పంపుతున్న దేశంతో మీకు స్నేహపూర్వక సంబంధాలు లేవు. అందుకే ప్రభుత్వాన్ని అర్థిస్తున్నాను... ఈ క్రికెట్ సిరీస్ విషయాన్ని తీవ్రంగా పునఃసమీక్షించాలి" అని అన్నారు. భారత్, పాక్ క్రికెట్ బోర్డుల చీఫ్ లు ఆదివారం నాడు కోల్ కతాలో సమావేశమయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ... ప్రతిపాదిత సిరీస్ డిసెంబర్ లో ఉండొచ్చని, తటస్థ వేదిక యూఏఈలో జరిగే ఆ సిరీస్ లో భాగంగా మూడు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టి20 మ్యాచ్ లు ఆడే అవకాశాలున్నాయని మీడియాకు తెలిపారు.