: బ్రిక్స్ బ్యాంక్ అధ్యక్షుడిగా కెవి కామత్
బ్రిక్స్ దేశాలు సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న బ్యాంకుకు అధ్యక్షుడిగా ఐసీఐసీఐ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కెవి కామత్ నియమితులు కాబోతున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయన పేరును ఖరారు చేసింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు కల్పించే లక్ష్యంగా గతేడాది బ్రిక్స్ సమావేశాల్లో ఈ బ్యాంక్ ఏర్పాటుకు బీజం పడింది. 100 బిలియిన్ డాలర్లతో ఈ అభివృద్ధి బ్యాంకు ఏర్పాటు కాబోతోంది. తొలుత ఆరేళ్లపాటు దాని కార్యకలాపాలన్నీ నిర్వర్తించేందుకు భారత్ అంగీకరించింది. ఈ క్రమంలో అనుభవజ్ఞుడైన 67 ఏళ్ల కామత్ ను ఎంపిక చేశారు. 1971లో ఐసీఐసీఐలో ఆయన తన కెరీర్ ను ప్రారంభించారు. తరువాత ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకులో చేరి పలు సంవత్సరాలు అందులోనే పని చేశారు. 1996లో తిరిగి ఐసీఐసీఐకు వచ్చి ఎండీగా, సీఈవోగా ఉన్నారు. 2008లో అప్పటి ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ తో గౌరవించింది.