: మహాత్మాగాంధీ మునిమనవడిపై కేసు నమోదు
మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీపై జలంధర్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడైన భగత్ సింగ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. భగత్ సింగ్ ను కించపరిచేలా తుషార్ గాంధీ మాట్లాడారని, ఆయనపై కేసు నమోదు చేయాలని బీజేపీ నేత, 'జన్ జాగృతి మంచ్' అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు అయిన కిషన్ లాల్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తుషార్ గాంధీపై సెక్షన్ 295(ఏ) కింద కేసు నమోదైంది. మత విశ్వాసాలకు భంగం కలిగించే చర్యలకు సంబంధించి ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. మే 8వ తేదీన జరిగిన ఓ కార్యక్రమంలో తుషార్ గాంధీ మాట్లాడుతూ, "బ్రిటీష్ ప్రభుత్వం భగత్ సింగ్ ను క్రిమినల్ గా పరిగణించింది. అందుకే అతనికి పడ్డ మరణశిక్షను రద్దు చేయాలని గాంధీ కోరలేదు" అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సంచలనం రేపాయి.