: పాత బస్తీ ‘స్ట్రీట్ ఫైట్’ వెనుక లవ్ అఫైర్... కూపీ లాగుతున్న పోలీసులు
హైదరాబాదులోని పాతబస్తీలో నిన్న వెలుగులోకి వచ్చిన స్ట్రీట్ ఫైట్ కీలక మలుపు తిరిగింది. ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నేపథ్యంలో చనిపోయిన నబీల్, అతడిని హతమార్చిన అబూబకర్ లు స్ట్రీట్ ఫైట్ కు సిద్ధపడ్డారని తెలుస్తోంది. ఈ మేరకు కేసు విచారణ చేపట్టిన పోలీసులు ఈ ఉదంతానికి లవ్ అఫైరే కారణమని నిర్ధారణకు వచ్చారు. ఒకే అమ్మాయిని ప్రేమించిన నబీల్, అబూబకర్ లు... ఆ అమ్మాయిని దక్కించుకునే విషయంలో స్ట్రీట్ ఫైట్ కు దిగారట. ఈ విషయంలో గతంలోనూ వీరిద్దరూ స్ట్రీట్ ఫైట్ కు దిగారని, ఆ ఫైట్ లో నబీల్, అబూబకర్ ను మట్టికరిపించాడని పోలీసులు చెబుతున్నారు. ఓటమి పరాభవం, ప్రేమించిన అమ్మాయి చేజారిపోతుందన్న బాధ అబూబకర్ ను మృగంలా మార్చేసిందని, ఈ క్రమంలోనే నబీల్ తో మరో స్ట్రీట్ ఫైట్ కు అతడు ప్రతిపాదించాడని తెలుస్తోంది. అబూబకర్ దుర్బుద్ధిని పసిగట్టలేని నబీల్ అతడి ప్రతిపాదనకు సరేనని ప్రాణాలు కోల్పోయాడని పోలీసులకు కీలక సమాచారం లభించిందట. ఇప్పటికే నబీల్, అబూబకర్ లిద్దరూ ప్రేమించిన అమ్మాయిని పోలీసులు గుర్తించారు. వీరు ముగ్గురి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను పరిశీలిస్తున్న పోలీసులు త్వరలోనే అసలు గుట్టును విప్పనున్నారు.