: డిసెంబర్ లో భారత్-పాక్ సిరీస్...షహర్యార్ ప్రతిపాదన, ప్రభుత్వం నిర్ణయించాలన్న దాల్మియా
ప్రపంచ క్రికెట్ లో భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ లకు ఉన్న క్రేజ్ మరే మ్యాచ్ లకు లేదు. ఈ మ్యాచ్ లకు ఇరు దేశాల వారే కాక ప్రపంచంలోని అన్ని దేశాల అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. అయితే ముంబైపై ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఈ దేశాల మధ్య మ్యాచ్ లు నిలిచిపోయాయి. తాజాగా ఈ దేశాల మధ్య క్రికెట్ సిరీస్ లకు మళ్లీ మార్గం సుగమమవుతోంది. ఈ మేరకు నిన్న కోల్ కతాకు వచ్చిన పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ షహర్యార్ ఖాన్, బీసీసీఐ చీఫ్ జగ్ మోహన్ దాల్మియాతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య క్రికెట్ సిరీస్ కు ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని షహర్యార్ చెప్పారు. ఈ దిశగా చర్యలు చేపట్టాలని ఆయన దాల్మియా ముందు ప్రతిపాదన పెట్టారు. పాక్ తో సిరీస్ కు తాము కూడా సానుకూలంగానే ఉన్నామని చెప్పిన దాల్మియా, ఈ విషయంలో భారత ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. భారత ప్రభుత్వం కూడా ఈ సిరీస్ కు సరేనంటే, డిసెంబర్ లో తటస్థ వేదిక యూఏఈలో ఇరుదేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ లు జరిగే అవకాశాలున్నాయి.