: అమెరికాను చుట్టేస్తున్న ‘చంద్రు’ల తనయులు...పెట్టుబడులు రాబడుతున్న లోకేశ్, కేటీఆర్
ఏపీ, తెలంగాణ సీఎంలు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావుల తనయులు నారా లోకేశ్, కె.తారకరామారావులు అమెరికాను చుట్టేస్తున్నారు. తమ తమ రాష్ట్రాలకు పెట్టుబడులు రాబట్టేందుకు అమెరికాలో పర్యటిస్తున్న లోకేశ్, కేటీఆర్ లు ఎవరికి వారుగా ముందుకు సాగుతున్నారు. ఇరువురు నేతలకు అక్కడి తెలుగు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కేటీఆర్ కంటే రెండు రోజులు ముందుగా అమెరికా చేరుకున్న లోకేశ్ మొన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అయ్యారు. ఇక పలువురు ఎన్నారైలతో పాటు అక్కడి వివిధ రాష్ట్రాల గవర్నర్లు, పారిశ్రామికవేత్తలతో భేటీ అయిన లోకేశ్, మంచి ఫలితాలనే రాబట్టారు. లోకేశ్ పర్యటన ఫలితంగా ఏపీలోని వెయ్యి గ్రామాలను దత్తత తీసుకునేందుకు ఎన్నారైలు ముందుకు వచ్చారు. రేపటితో అమెరికాలో తన పర్యటనను ముగించుకుని లోకేశ్ తిరిగి రానున్నారు. ఇదిలా ఉంటే, లోకేశ్ వెళ్లిన రెండు రోజుల తర్వాత అమెరికాలో కాలిడిన కేటీఆర్, తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూల అంశాలు ఏకరువు పెడుతూ అక్కడి పారిశ్రామికవేత్తల్లో ఆసక్తి పెంచుతున్నారు. లోకేశ్ కు ఘన స్వాగతం లభించిన డల్లాస్ లో కేటీఆర్ కు రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎన్నారైలను కేటీఆర్ బాగానే ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే ఆయన పెద్ద సంఖ్యలో పెట్టుబడులను రాబట్టగలిగారు. ఇంకా పది రోజుల పాటు ఆయన అక్కడే పర్యటించనున్నారు.