: ‘అమ్మ’ భవిష్యత్తు తేలేది నేడే...పూజల్లో అభిమానులు, టెన్షన్ లో కన్నడ పోలీసులు


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత భవిష్యత్తు నేడు తేలిపోనుంది. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు, రూ.100 కోట్ల జరిమానాకు గురైన జయలలిత ప్రస్తుతం సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్ తో చెన్నైలోని తన పోయెస్ గార్డెన్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. పరప్పణ అగ్రహార కోర్టు ఇచ్చిన తీర్పుపై కర్ణాటక హైకోర్టు నేడు తుది తీర్పును వెలువరించనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపిన హైకోర్టు నేటి ఉదయం 11 గంటలకు తీర్పును వెల్లడించనుంది. ట్రయల్ కోర్టు తీర్పులో దోషిగా తేలిన జయలలిత ఇప్పటికే తమిళనాడు సీఎం పదవి కోల్పోగా, నేటి హైకోర్టు తీర్పు ఆమెకు వ్యతిరేకంగా వస్తే రాజకీయాలకు కూడా ఆమె దూరం కాక తప్పదు. అంతేకాక ఆమె నేతృత్వంలోని అన్నాడీఎంకే భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం కానుంది. ఇక వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ప్రత్యర్థి పార్టీ డీఎంకే తిరిగి అధికారం చేజిక్కించుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే, జయలలితకు ఈ కేసు నుంచి విముక్తి లభించాలని ఆమె అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. మరోవైపు తీర్పు నేపథ్యంలో బెంగళూరులోని కర్ణాటక హైకోర్టు పరిసరాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. తమిళ తంబీలు పెద్ద సంఖ్యలో బెంగళూరు చేరుకునే అవకాశాలున్నాయి. దీంతో కోర్టు చుట్టుపక్కల కిలో మీటరు పరిధిలో నిషేధాజ్ఞలు విధించిన బెంగళూరు పోలీసులు, గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జయకు వ్యతిరేకంగా తీర్పు వెలువడితే, అమె అభిమానులు విధ్వంసం సృష్టించే అవకాశాలున్నాయన్న సమాచారంతో నగరవ్యాప్తంగా భారీ సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించాయి.

  • Loading...

More Telugu News