: రాజకీయాలు నా భాష కాదు... ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను: కిరణ్ బేడీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా పోటీచేసిన మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. క్రియాశీల రాజకీయాలకు తాను దూరమని, గతంలో వలే ప్రజాసేవలో చురుగ్గా పాల్గొంటానని తెలిపారు. తాను క్రియాశీల రాజకీయవేత్తను కానని, రాజకీయాలు తన భాష కాదని అన్నారు. మరోసారి ఎన్నికల్లో పాల్గొనబోనని చెప్పారు. ఉమెన్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు ఆమె గోవాలోని పనాజీకి విచ్చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన అభిప్రాయాలు పంచుకున్నారు. తన జీవితం ఎంతో సంపన్నమని, ఎంతో జ్ఞానయుతమని, ఎంతో అనుభవ సహితమని, ఎంతో అంతఃదృష్టితో కూడినదని వివరించారు. మునుపెన్నడూ తెలియని విషయాల పట్ల కూడా ఇప్పుడు వివేకం కలిగి ఉన్నానని వివరించారు. ఇక, ఢిల్లీ ఎన్నికలను తన జీవితంలో అత్యుత్తమ అనుభవం అని పేర్కొన్నారు. తనకు ఆ అనుభవం దక్కేందుకు తోడ్పడిన బీజేపీకి కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ తనను నమ్మి అవకాశం ఇచ్చిందని తెలిపారు.