: గంగానదిలో కొట్టుకుపోయిన యూపీ కార్మిక శాఖ మంత్రి కుమార్తె


ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ మంత్రి షాహిద్ మంజూర్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన కుమార్తె అబిదా హసన్ (24) గంగానదిలో ప్రమాదవశాత్తు గల్లంతైంది. గంగానదిలో రివర్ రాఫ్టింగ్ (రబ్బరు డింగీ వంటి పడవలో ప్రయాణం) చేస్తుండగా, ఆమె నదిలోకి జారిపోయింది. మీరట్ లో ఎండీ విద్య అభ్యసిస్తున్న ఆమె కళాశాల తరపున ఉత్తరాఖండ్ యాత్రకు వెళ్లింది. రిషికేశ్ లోని ఫూల్చటి వద్ద సహాధ్యాయిలతో కలిసి ఆదివారం ఉదయం రివర్ రాఫ్టింగ్ చేస్తుండగా ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. కుమార్తె గల్లంతైన వార్త తెలిసిన వెంటనే మంత్రి షాహిద్ మంజూర్ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మంజూర్... సీఎం అఖిలేశ్ యాదవ్ క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News