: మనసు బాగాలేదన్నా వినలేదు... రెచ్చగొట్టడం వల్లే నబిల్ ఫైట్ చేశాడు: డీసీపీ
హైదరాబాద్ పాతబస్తీలో ఎంఎంఏ (మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్) తరహాలో ఫైట్ చేసి దురదృష్టవశాత్తు నబిల్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోవడంపై పోలీసులు దృష్టి సారించారు. దీనిపై డీసీపీ సత్యనారాయణ మాట్లాడుతూ... ఈ ఘటనకు సంబంధించి వీడియోలు పరిశీలించామని తెలిపారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. రేపు సాయంత్రంలోగా పూర్తి వివరాలు తెలుసుకుంటామని అన్నారు. మిగతా వ్యక్తుల సెల్ డేటా ఆధారంగా వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. నబిల్ మృతదేహానికి రీ-పోస్టుమార్టం నిర్వహిస్తామని, తలపై దెబ్బల కారణంగానే చనిపోయి ఉంటాడని భావిస్తున్నామని తెలిపారు. ఈ ఫైట్ల వెనుక బెట్టింగులు ఉన్నాయని అనుమానిస్తున్నామన్నారు. పక్కన ఉన్నవారు రెచ్చగొట్టడం వల్లే సరదాగా మొదలైన ఫైట్ ప్రాణాంతకంగా మారిందని డీసీపీ వివరించారు. మనసు బాగాలేదని నబిల్ పేర్కొన్నా పక్కన ఉన్నవారు రెచ్చగొట్టారని, దీంతో, ఆ విద్యార్థి పంతానికి పోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడని చెప్పారు. తమకు ఈ తరహా పోరాటాలపై ఫిర్యాదులు అందాయని తెలిపారు. ప్రస్తుతానికి హత్య కేసు నమోదు చేసినా, హత్యగా భావించడంలేదని అన్నారు.