: కాల్పులతో ఉలిక్కిపడిన 'భూతల స్వర్గం'... పలువురు మృతి
స్వర్గం అంటే ఇలా ఉంటుందేమో అనిపించే దేశం స్విట్జర్లాండ్. ఆహ్లాదకరమైన ప్రకృతికి కేరాఫ్ అడ్రస్ ఆ దేశం. ఎటుచూసిన పచ్చదనం, మెరిసే వెండిని తలపించే మంచుకొండల సోయగం... వెరసి ప్రపంచ పర్యాటకులకు హాట్ స్పాట్ గా వర్ధిల్లుతున్న ఈ యూరప్ కంట్రీ ఇప్పుడు కాల్పుల మోతతో ఉలిక్కిపడింది. స్విట్జర్లాండ్ ఉత్తరప్రాంతంలోని వూరెన్ లింగెన్ పట్టణంలో ఓ నివాస ప్రాంతంలో శనివారం రాత్రి 11 గంటల తర్వాత కాల్పుల శబ్దం వినపడిందని స్థానికులను ఉటంకిస్తూ పోలీసులు తెలిపారు. ఓ ఇంటి ఎదుట పలు మృతదేహాలు కనిపించాయని, మృతులందరూ పెద్దవాళ్లేనని, వారిని గుర్తించేందుకు యత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. జర్మనీ సరిహద్దుకు సమీపంలో జ్యూరిచ్ కు వాయవ్య దిశలో ఉండే ఈ పట్టణ జనాభా 4,500. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాల్పులకు కారణం ఎవరన్నది పరిశోధిస్తున్నామని పోలీసులు తెలిపారు.