: 'టీమ్ ఇండియా' లేకుండా భారత్ మార్పు చెందదు: మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమబెంగాల్ లోని బర్నపూర్ లో నేడు ఐఐఎస్ సీఓ స్టీల్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'టీమ్ ఇండియా' కృషి వల్లే ఈ అభివృద్ధి సాధ్యమైందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుంటే ఈ ప్లాంట్ ఏర్పాటయ్యేదే కాదని అన్నారు. అందుకే తాను 'టీమ్ ఇండియా' ప్రాధాన్యతను పదేపదే ప్రస్తావిస్తుంటానని తెలిపారు. రాష్ట్రాల్లో అధికారంలో ఏ పార్టీ ఉన్నా, అభివృద్ధి విషయానికి వచ్చేసరికి, అందరూ ఒకటేనన్న భావన కనబర్చాలని, 'టీమ్ ఇండియా' అంటే అదేనని వివరించారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు ఏకమైతేనే దేశం ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు. రాజకీయ విభేదాలున్నా, ఆ ప్రభావం అభివృద్ధిపై పడరాదని ప్రధాని మోదీ సూచించారు. ఈశాన్య భారతావనిని శక్తిమంతం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, తొలుత పశ్చిమబెంగాల్ ను బలోపేతం చేయాలని అన్నారు. భారత ఈశాన్య ప్రాంతంలో అమేయ శక్తి ఉందని, ప్రజలు నైపుణ్యం ఉన్నవాళ్లని కొనియాడారు. ఇక, తన ప్రభుత్వంలో ఏ కుంభకోణాలు చోటుచేసుకోలేదని ఉద్ఘాటించారు.