: నన్నే చెక్ చేస్తారా?... డ్రంకెన్ డ్రైవింగ్ నేపథ్యంలో పోలీసులపై మహిళా అధికారి తీవ్ర ఆగ్రహం
రాత్రి పూట మద్యం తాగి వాహనాలను నడిపే వారిపై జంటనగరాల పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. బ్రీత్ అనలైజర్ తో టెస్ట్ చేసి, మద్యం సేవించిన వారిపై కేసులు బుక్ చేసి, కోర్టు ముందు నిలబెడుతున్నారు. ఈ క్రమంలో, పలువురు సెలబ్రిటీలు సైతం పోలీసులకు బుక్ అవడం తెలిసిందే. యథావిధిగా నిన్న రాత్రి కూడా పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ చెకింగ్ నిర్వహిస్తుండగా, జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి వద్ద పెద్ద సీన్ క్రియేట్ అయింది. జీహెచ్ఎంసీలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్న మహిళా అధికారి పుష్యరాగం వాహనాన్ని ఆపిన పోలీసులు, ఆమెకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయబోయారు. అంతే... పుష్యరాగం ఆగ్రహంతో ఊగిపోతూ, అంతెత్తున లేచారు. నన్నే టెస్ట్ చేస్తారా? అంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు. తీవ్ర వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా, టెస్ట్ కు కూడా సహకరించలేదు. దీంతో, చేసేదేమీ లేక... ఆమెను పోలీసులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.