: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్...ఓపెనర్లిద్దరూ ఔట్
ఐపీఎల్-8 సీజన్ లో భాగంగా కొద్దిసేపటి క్రితం రాయ్ పూర్ లో ప్రారంభమైన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాదు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీతో జరుగుతున్న ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓపెనర్లు శిఖర్ ధావన్ (13), డేవిడ్ వార్నర్ (17) ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించారు. అయితే నాలుగో ఓవర్ లో శిఖర్ ధావన్ వెనుదిరగగా, ఐదో ఓవర్ రెండో బంతికే డేవిడ్ వార్నర్ కూడా ఔటయ్యాడు. జహీర్ ఖాన్ వేసిన బంతిని ధావన్ గాల్లోకి లేపాడు. లాంగాన్ లో ఉన్న అల్బీ మోర్కెల్ గాల్లోకి లేచిన బంతిని ఒడిసిపట్టాడు. ఆ తర్వాత మరో మూడు బంతుల్లోనూ వార్నర్ కూడా వెనుదిరిగాడు. ఐదు ఓవర్లు కూడా ముగియకముందే రెండు కీలక వికెట్లు కోల్పోయిన సన్ రైజర్స్ ఇబ్బందుల్లో పడింది. ధావన్ స్థానంలో మోయిసెస్ హెన్రికాస్, వార్నర్ స్థానంలో ఇయాన్ మోర్గాన్ (1) క్రీజులోకొచ్చారు. ఐదు ఓవర్లు ముగిసేసరికి సన్ రైజర్స్ రెండు వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది.