: ప్రేక్షకులను ఊహాలోకంలో విహరింపజేసిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి'కి పాతికేళ్లు
ఈ చందమామ కథ ఎవరిని అలరిస్తుంది? అసలు ఇదేం సినిమా? ఇప్పట్లో ఇలాంటి సినిమాలు ఎలా అడతాయి? అని పెదవి విరుపులు, వెక్కిరింతలు ఎదురైనా వాటన్నంటినీ దాటి, తెలుగు సినీ చరిత్రలో అద్భుతమైన సోషియో ఫాంటసీ సినిమాగా నిలిచిపోయిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సినిమాకి 25 వసంతాలు నిండాయి. 1990 మే 9న రిలీజైన ఈ సినిమాను వర్ణించేందుకు అతిశయోక్తులు సరిపోవంటే వింత కాదు. తెలుగు సినిమాలలో దేవుళ్లు, మానవుల మధ్య సంబంధం ఈ నాటిది కాదు. విఠలాచార్య తెలుగు సినీ ప్రేక్షకుడికి మాయలు, మంత్రాలతోపాటు, దేవదానవులను కూడా పరిచయం చేశారు. ఆయన తరువాతి తరాలు ఆయన స్పూర్తితో ఎన్నో సినిమాలు నిర్మించినప్పటకీ సోషియో ఫాంటసీ సినిమాగా 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సినిమా నెలకొల్పిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. హిందీ, కన్నడ, తెలుగు సినీ రంగాలకు చెందిన విలన్లతో భయపెట్టినా, ముగ్గురు విలన్లకు ఎదురొడ్డి నిలిచే హీరోగా చిరంజీవి అసమాన నటనను వర్ణించాలంటే పదాలు సరిపోవు. దేవకన్య ఇలాగే ఉంటుందా? అనేంత సుకుమారంగా సౌందర్యరాశి శ్రీదేవి పలికించిన భావాలను వర్ణించాలంటే కవులు కొత్తభాష వెతుక్కోవాల్సిందే! ఈ సినిమా గురించి నిర్మాత అశ్వనీ దత్ మాట్లాడుతూ, సినీ జీవితంలో ఇలాంటి ఒక సినిమా నిర్మిస్తే చాలని ప్రతి నిర్మాత భావిస్తారని, అలాంటి విజయాన్ని తనకు జగదేకవీరుడు అతిలోకసుందరి ఇచ్చిందని అన్నారు. ఈ సినిమా విడుదలైన తొలి రోజు ఓ వ్యక్తి సైకిల్ పై వచ్చి తన కారు ఆపి 'ఏం సినిమా తీశావు. సరిగ్గా ఏడాది ఆడుతుంద'ని చెప్పాడని దత్తు అన్నారు. ఆయన మాటలు అక్షరసత్యాలయ్యాయని, సినిమా గురించి ఎప్పుడు తల్చుకున్నా ఆయన గుర్తుకొస్తారని చెప్పారు. ప్రముఖ దర్శకుడు జంధ్యాల రాసిన మాటలు, యండమూరి వీరేంద్ర నాథ్ సమకూర్చిన స్క్రీన్ ప్లే అభిమానులను అలరించగా, ఇళయరాజా పాటలు నేటి ప్రేక్షకులను కూడా అలరించడం విశేషం. ఈ సినిమాలో పాటలు రీమిక్స్ తో అద్భుతాలుగా మారుతున్నాయి. సినిమాను అద్భుతమైన దృశ్య కావ్యంగా మలచడంలో అజయ్ విన్సెంట్ కృషిని కీర్తించకుండా ఉండడం అసాధ్యం. సినిమాను తీర్చిదిద్దిన దర్శకేంద్రుడు తెలుగు సీనీ జగత్తులో ఇంద్రుడుగా కీర్తించబడ్డాడు. వీరి నైపుణ్యానికి హీరో చిరంజీవి, హీరోయిన్ శ్రీదేవి ప్రాణం పోస్తే, విలనిజంతో కన్నడ ప్రభాకర్, రామిరెడ్డి, తనికెళ్ల భరణి సినిమాకు వెన్నెముకగా నిలివగా, అమ్రీష్ పురి మాంత్రికుడిగా ఊపిరిలూదారు. ఇతర కళాకారులు అద్భుత ప్రతిభతో 'జగదేకవీరుడు అతిలోకసుందరి' తెలుగు సీనీ చరిత్రలో అద్భుతమైన దృశ్య కావ్యంగా నిలిచిపోయింది. ఈ సినిమాను డిజిటలైజ్ చేసి త్వరలో విడుదల చేస్తామని నిర్మాత అశ్వనీదత్ చెబుతున్నారు.