: రెండేళ్లలో 10 మిలియన్లకు చేరుకోబోతున్న గోవా వార్షిక పర్యాటకుల సంఖ్య
దేశంలో అత్యంత పర్యాటక రాష్ట్రంగా పేరొందిన గోవా పర్యాటకుల సంఖ్య ప్రతి ఏడాదికి పెరిగిపోతోంది. 2017 నాటికి ఈ సంఖ్య 10 మిలియన్లకు (కోటి) చేరుకుంటుందని ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి దిలీప్ పరులేకర్ పనాజీలో తెలిపారు. "2017 నాటికి గోవాకు వచ్చే వార్షిక పర్యాటకుల సంఖ్య పది మిలియన్లకు చేరుకునే అవకాశం ఉంది. అదే ఏడాది గోవా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి" అని ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి చెప్పారు. అయితే 2012లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మొత్తం పర్యాటకం 12 శాతం పెరిగిందన్నారు. గతేడాదితో పోల్చితే పర్యాటకుల సంఖ్య 9 శాతం పెరిగిందని తెలిపారు. ఏడాదికి దాదాపు 5 మిలియన్ల మంది గోవాను సందర్శిస్తూ ఉండేవారని, ఈ సంఖ్య మరింత పెరుగుతుందని దిలీప్ ధీమా వ్యక్తం చేశారు.