: శిద్ధా... ఇలాగైతే ఎలా?: ఆర్టీసీ సమ్మెపై చంద్రబాబు అసంతృప్తి
తెలుగు రాష్ట్రాల్లో నాలుగో రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మెపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమ్మె ప్రభావం, సమ్మె విరమణ దిశగా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న చర్యలపై ఆయన కొద్దిసేపటి క్రితం రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు, ఆర్టీసీ ఎండీ సాంబశివరావులతో సమీక్షించారు. ఈ సందర్భంగా 27 శాతం ఫిట్ మెంట్ కు కార్మికులను ఒప్పించడంలో విఫలమయ్యారంటూ మంత్రి శిద్ధా, ఎండీ సాంబశివరావులపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాక చర్చల సందర్భంగా కార్మిక సంఘాల నేతలతో గొడవపడటమేమిటని కూడా చంద్రబాబు వారిద్దరిపై మండిపడ్డారు. వేతన సవరణకు సంబంధించి నియమించిన కేబినెట్ సబ్ కమిటీతో తక్షణమే భేటీ కావాలని ఆయన మంత్రి, ఎండీలకు ఆదేశాలు జారీ చేశారు. కార్మికులు వారికి వారుగా చర్చలకు ముందుకు వస్తేనే సమస్య పరిష్కారమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.