: హర్యానాలో బయటపడ్డ 'అదృశ్య' సరస్వతీ నది
గంగ, యమున, సరస్వతి... ఈ మూడు నదుల కలయికే అలహాబాద్ లోని పవిత్ర త్రివేణీ సంగమం. గంగ, యమున పైకి కనిపిస్తాయికానీ, సరస్వతీ నది మాత్రం కనపడదు. అది అంతర్వాహిని. పురాణాల్లో, వేదాల్లో ఘనమైన ప్రస్తావన ఉన్న సరస్వతీ నది జాడల కోసం ఎన్నో ఏళ్లుగా వెతుకుతున్న పురాతత్వ శాస్త్రజ్ఞులు విజయం సాధించినట్టు తెలుస్తోంది. గత నెలలో యమునా నదికి ఐదు కిలోమీటర్ల దూరంలోని ఆది బద్రి (హర్యానా) ప్రాంతంలో తవ్వకాలు చేపట్టగా, నదీ మార్గం కనిపించిందని తెలుస్తోంది. కేవలం ఎనిమిది అడుగుల లోతున నీరు పెల్లుబికిందని, ఈ ప్రాంతం పవిత్ర సరస్వతీ నది ప్రవహించిన మార్గంగా నమ్మేవారని తెలుస్తోంది. ఈ నది సుమారు 5 నుంచి 6 వేల సంవత్సరాల క్రితం ప్రవహించిందని, ఆపై అంతర్థానమైందని మాత్రమే ప్రపంచానికి తెలుసు. సరస్వతీ నది ఆనవాళ్లపై ఆర్కియాలజీ విభాగం అధికారిక ప్రకటన వెలువరించాల్సి వుంది. ఈ నది ఆనవాళ్లు కనుగొనాలని కేంద్రం, హర్యానా ప్రభుత్వాలు సంయుక్తంగా ఆపరేషన్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఎంఎన్ఆర్ఈజీఏ పథకం కింద పదుల కొద్దీ రోజువారీ కూలీలతో తవ్వకాలు జరుపుతున్నారు. నీరు పెల్లుబికిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు.