: నేను చనిపోయేలోగా ఒక్క ఒలింపిక్ పతకమైనా గెలవండి: లెజండ్ అథ్లెట్ విజ్ఞప్తి
తాను చనిపోయేలోగా అథ్లెటిక్స్ లో ఒక్క ఒలింపిక్ బంగారు పతకాన్నైనా గెలవాలని 'ఫ్లయ్యింగ్ సిక్'గా పేరున్న లెజండరీ అథ్లెట్ మిల్కా సింగ్ ఈ తరం క్రీడాకారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. 1960 రోమ్ ఒలింపిక్స్ లో తృటిలో పతకాన్ని చేజార్చుకున్న ఆయన తన కోరికను భారత అథ్లెట్లు తీరుస్తారనే భావిస్తున్నట్టు తెలిపారు. ఓ స్పోర్ట్స్ అవార్డుల కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, "నా చివరి కోరిక ఏమిటంటే, నేను చనిపోయేలోగా, భారత క్రీడాకారుడు లేదా క్రీడాకారిణి ఓ బంగారు పతకాన్ని దేశం కోసం సంపాదించాలి. గెలవడంలో నేను విఫలమయ్యాను. ఓ ఇండియన్ ఆ ఘనత సాధించాలని కోరుకుంటున్నా" అన్నారు. రోమ్ లో జరిగిన ఒలింపిక్స్ లో 400 మీటర్ల ఫైనల్ పోరులో మిల్కా సింగ్ 45.60 సెకన్లలో లక్ష్యాన్ని చేరి నాలుగో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. "ఆ సమయంలో 400 మీటర్ల రేసులో ఎవరైనా మెడల్ గెలుస్తారనుకుంటే అది మిల్కా సింగ్ మాత్రమే అని ప్రపంచానికి తెలుసు. కానీ ఆ సమయంలో ఆశాభంగమైంది" అని ఆయన అన్నారు. తన తరువాత గుర్ బచన్ సింగ్, శ్రీరామ్ సింగ్, పీటీ ఉష వంటి వారు ఫైనల్స్ వరకూ వెళ్లినా మరొక్క అడుగు వేయడంలో విఫలమయ్యారని గుర్తు చేశారు.