: పురుషులకి రక్షణలేదా?...పురుషుల్ని సమాజంలో ఉండనివ్వరా?: సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ట్రస్ట్ బోర్డ్
సమాజంలో స్త్రీలు, పిల్లలు, అడవులు, జంతువులను సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వాలు పురుషులను రక్షించేందుకు చర్యలు తీసుకోవడం లేదని, పురుషులకు సమాజంలో ఉండే అర్హత లేదన్న పరిస్థితులు నెలకొంటున్నాయని సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పురుషుల రక్షణకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. భారత శిక్షా స్మృతిలోని 498(ఏ) కారణంగా వివాహ వ్యవస్థ భగ్నమవుతోందని వారు పేర్కొన్నారు. దేశంలో 50 శాతానికి పైగా చట్టాలు పురుషులకు వ్యతిరేకంగా ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 498(ఏ) కారణంగా దేశంలో ఎంతోమంది పురుషులు నిత్యం ఇక్కట్లపాలవుతున్నారని వారు పేర్కొన్నారు. ఈ చట్టం కారణంగా 25 లక్షల మంది జైలుపాలయ్యారని వారు వెల్లడించారు. 498(ఏ)ను లీగల్ టెర్రరిజంగా సాక్షాత్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని వారు గుర్తు చేశారు. దీనిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించనున్నామని వారు తెలిపారు.