: కష్టాల్లో కూడా నవ్వుతూ ఎలా ఉండాలి?... మరణం తరువాత సంచలనం సృష్టిస్తున్న చిన్నారి రచనలు
ఐషా చౌదరి... పుట్టినప్పటి నుంచి కష్టాలే. ఆరు నెలల వయసులోనే పాపకు భయంకర వ్యాధి ఉందని, ఎక్కువ కాలం బతకదని వైద్యులు తేల్చేశారు. చిన్నారిని సాధ్యమైనంత ఎక్కువ కాలం బతికించాలని 1998 ప్రాంతంలోనే 'సన్ రైజ్ ఇన్ లండన్' అనే రేడియో స్టేషన్ ప్రత్యేక కార్యక్రమం చేపట్టి నిధులను సమీకరించింది. దాతలు స్పందించడంతో బోన్ మారో (ఎముకల్లో మూలుగ) ఆపరేషన్ జరిగింది. అయినప్పటికీ, బాలిక కొంతకాలమే బతుకుతుందని వైద్యులు తెలిపారు. ఆమె తన 18 సంవత్సరాల వయసులో గత జనవరిలో మరణించింది. మరణానికి రెండేళ్ల ముందు నుంచి వీల్ చైర్ కే పరిమితమైన ఐషాకు శ్వాస కూడా యంత్రాలతో అందించారు. రోజుకు ఒక ఇంజక్షన్ వేస్తూ బతికిస్తూ వచ్చారు. చివరి దశలో బాధ పెరిగిపోవడంతో మత్తు కోసం 'మార్ఫిన్' ఇంజక్షన్లను ఇస్తూ వచ్చారు. ఆ చిన్నారి తనకోసం రాసుకున్న పుస్తకం 'మై లిటిల్ ఎపిఫనీస్' (నా చిన్ని పండగలు) ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. డెత్ (డీఈఏటీహెచ్) కు 'డ్రాప్ ఎవ్రీథింగ్ అండ్ ట్రస్ట్ హిమ్' అంటూ నిర్వచనమిచ్చిన ఐషా కష్టాల్లో కూడా నవ్వుతూ ఉండటాన్ని ఎలా అలవాటు చేసుకోవాలో సూచిస్తూ రచనలు చేసింది. ఆమె రాతలు కొన్ని హృదయాన్ని తాకుతున్నాయని వాటిని చదివిన వారు మెచ్చుకుంటున్నారు. "నీకే సానుభూతి కావాలని భావిస్తున్న సమయంలో మరొకరిపై సానుభూతి చూపడం ఎంత కష్టమైన పనో" అంటూ పెద్దలు సైతం అబ్బురపడేలా వాక్యాలు రాసుకుంది. కొన్ని పద్యాలు కూడా రాసింది. "నా తలపై ఒకప్పుడు నల్లని గిరజాల జుట్టు ఉండేది. నల్లని తేనెటీగల రంగులోని నా శిరోజాలు, వయసు మీదపడడం వల్ల ఇప్పుడు పీచుగా మారాయి. అచ్చం బుద్ధుడిలా... ఒకప్పుడు నా వక్షోజాలు అందంగా, గుండ్రంగా ఉండేవి. ఇప్పుడు ఖాళీ అయిపోయిన తోలు నీటి సంచుల్లా జారిపోయాయి. ఒకప్పుడు నా కాళ్లు చాలా అందంగా ఉండేవి. తరువాత ఏనుగు తొండంలా మారిపోయాయి. ఇప్పుడు వెదురు కర్రల మాదిరి ఉన్నాయి. సత్యానికి ప్రతినిధిగా నిలిచిన బుద్ధుడి మాదిరి... అంతకుమించి తేడా ఏమీ లేదు" అన్న ఆమె వాక్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. దేవుడికి టెలిగ్రామ్ కొడుతున్నానంటూ... "ప్రియమైన దేవుడా, ఇక్కడ నాకింకా కొంత పని మిగిలివుంది. నీకు సరేననిపిస్తే నేనిక్కడ సాధ్యమైనంత ఎక్కువ కాలం ఉంటాను. ప్రేమతో... నేను" అని రాసుకుంది. నిర్ఘాంత పరుస్తున్న ఆమె రచనలను పుస్తక రూపంలోకి తీసుకురాగా, భారత్ లో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ దీన్ని విడుదల చేశారు.