: యుద్ధం చెయ్యాల్సి వస్తే 20 రోజుల కన్నా ఎక్కువ నిలవలేము... భారత సామర్థ్యంపై కాగ్ సంచలన నివేదిక
ఏదైనా దేశంతో ఇండియా యుద్ధం చెయ్యాల్సి వస్తే 20 రోజుల కన్నా ఎక్కువ సమయం పోరులో నిలవలేమని, మందుగుండు సామగ్రి కొరత తీవ్రంగా ఉండడమే ఇందుకు కారణమని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) నివేదికను విడుదల చేసింది. 15 నుంచి 20 రోజుల కన్నా ఎక్కువ సమయం నిలవలేదని తేల్చి చెప్పింది. 30 సంవత్సరాలుగా అభివృద్ధి దశలోనే ఉన్న దేశవాళీ తేలికపాటి యుద్ధ విమానాలు 'తేజాస్' ఎప్పటికి సైన్యానికి అందుబాటులోకి వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించింది. భారత్ లో 11.8 కోట్ల మంది వివిధ విభాగాల్లో భద్రతా సేవలను అందిస్తున్నారని వెల్లడించిన కాగ్ సరిపడినన్ని యుద్ధ విమానాలు కూడా లేవని తెలిపింది. శుక్రవారం ఈ నివేదిక పార్లమెంట్ ముందుకు రాగా, కాగ్ వెల్లడించిన వివరాలు సంచలనం రేపుతున్నాయి. సైన్యానికి చాలినంత మందుగుండు సామగ్రి అందించడంలో రక్షణ శాఖ తీవ్రంగా విఫలం కావడం దిగ్భ్రాంతిని కలిగిస్తోందని పేర్కొంది. కనీసం 40 రోజుల పాటు యుద్ధానికి సరిపడినంత ఆయుధాలు వుండాల్సిన నిబంధనలు ఉన్నప్పటికీ, లక్ష్యానికి సగం దూరంలో సైతం భారత్ లేదని తెలిపింది. మొత్తం 170 రకాల ఆయుధాల్లో 125 రకాలు 20 రోజుల యుద్ధానికి సరిపడవని, 50 శాతం ఆయుధ సామగ్రి 10 రోజుల్లోనే పూర్తవుతుందని హెచ్చరించింది. 2019 తరువాతనే 40 రోజుల పాటు యుద్ధం చెయ్యాల్సిన పరిస్థితులు రావచ్చని, ఆలోగా మందుగుండును పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోవాలని సూచించింది.