: అద్దె కట్టండి, ఇల్లు సొంతం చేసుకోండి... హైదరాబాదీలకు బంపరాఫర్
సొంతిల్లు లేదని భాధపడుతున్నారా? నెలనెలా అద్దెల రూపంలో వేలకు వేలు చెల్లిస్తున్నారా? ఇకపై అటువంటి అవసరం రాదు. మీకోసం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) బంపరాఫర్ ను తీసుకొచ్చింది. ‘అద్దె చెల్లించండి. కొన్నేళ్ల తర్వాత మీరే ఆ ఫ్లాటును సొంతం చేసుకోండి’ అంటూ మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చేలా ‘హైర్ అండ్ పర్చేజ్’ స్కీమును ప్రారంభించాలని యోచిస్తోంది. కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే దీనిపై ముందడుగు పడుతుందని తెలుస్తోంది. మధ్యతరగతి ప్రజలకు సొంత ఇల్లు కలగానే మిగులుతున్న ప్రస్తుత తరుణంలో "ఎప్పటికీ అద్దె ఇల్లే గతి" అని బాధపడేవారిని సొంత ఇల్లుకు యజమానులను చేయడమే ఈ పథకం ముఖ్య లక్ష్యం. హైదరాబాద్ పరిధిలోని ఖాళీ స్థలాల్లో బహుళ అంతస్తుల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి, దానికైన ఖర్చును బట్టి చెల్లించాల్సిన అద్దె, కాలపరిమితిని జీహెచ్ఎంసీ నిర్ణయిస్తుంది. ఈ భవనాలు ఆరు ఫ్లోర్లను కలిగివుంటాయని తెలుస్తోంది. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం గ్రేటర్ లో మరో 2 లక్షల ఇళ్లు అవసరమని తేలిన నేపథ్యంలో ఈ పథకానికి మంచి స్పందన వస్తుందని అంచనా.