: సల్మాన్ కు బెయిలిప్పించినందుకు లాయర్ ఫీజు రూ. 25 లక్షలట!
సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో అతనికి ఐదేళ్ల శిక్ష పడుతుందని ముందే ఊహించిన ఓ లాయర్, సల్మాన్ కు ఆ విషయాన్ని ముందే చెప్పి, అదే జరిగితే ఏం చేస్తే బెయిలు వస్తుందో కూడా వివరించాడట. ఆపై దగ్గరుండి హైకోర్టుకు హాజరై తనదైన వాదన వినిపించి తొలుత రెండు రోజుల తాత్కాలిక బెయిలు, ఆపై పూర్తి స్థాయి బెయిలు రావడానికి కారణంగా నిలిచిన ఆ లాయర్ ఎవరో తెలుసుగా? ఆయనే కేంద్ర మాజీ మంత్రి ఎన్.కె.పి సాల్వే కుమారుడు హరీష్ సాల్వే. ఇండియాలో అత్యంత డిమాండున్న, ఖరీదైన లాయర్లలో ఒకరు. రతన్ టాటా, ముఖేశ్ అంబానీ లాంటి కార్పోరేట్ దిగ్గజాలు సైతం హరీష్ సాల్వే కోసం క్యూ కడుతున్నారంటే అతని డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. న్యాయపరమైన సలహాల కోసం అంబానీ కంపెనీ రూ. 15 కోట్లు చెల్లిస్తోందంటే హరీష్ సాల్వే కెపాసిటి ఏంటో తెలుసుకోవచ్చు. కాగా, సల్మాన్ కేసులో బుధవారం నాడు హైకోర్టుకు వచ్చి పది నిమిషాలు వాదించినందుకు హరీష్ సాల్వేకు ముట్టిన ఫీజు అక్షరాలా ఇరవై అయిదు లక్షల రూపాయలు మాత్రమేనట. వాస్తవానికి ఈ కేసు వాదనలను సల్మాన్ ముంబైలో పేరున్న డీఎస్ కే లీగల్ అనే సంస్థకు అప్పగించారు. డీఎస్ కే తరపున ఆనంద్ దేశాయ్, నిర్వా షా, మన్హర్ సింగ్ సైనీ తదితరులు సల్మాన్ కేసును దాదాపు పుష్కర కాలానికి పైగా సాగదీస్తూ వచ్చారు. అందుకుగాను వీరికి రూ. 15 కోట్ల రూపాయల వరకూ ఫీజుల రూపంలో ముట్టినట్టు తెలుస్తోంది.